దుబాయ్‌ నుంచి వచ్చాడని.. బస్సు దించేశారు!

హైదరాబాద్‌ : దుబాయ్‌ నుంచి వచ్చి బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు. కరోనా లక్షణాల ఉండటంతో అతన్ని బస్సులో నుంచి దించివేశారు. ఈ ఘటన ఎల్‌బీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండపాటి నాని(22) దుబాయ్‌ నుంచి విమానంలో ముంబై చేరుకున్నాడు. అక్కడి నుంచి హైదరాబాద్‌ వచ్చిన నాని ప్రైవేటు బస్సులో భీమవరం బయలుదేరాడు. అయితే నాని చేతిపై స్టాంప్‌ను గుర్తించిన తోటి ప్రయాణికులు దాని గురించి ఆరా తీశారు. వారు అలా అడిగేసరికి నాని కంగారు పడ్డాడు. దీంతో నాని ప్రవర్తనపై అనుమానం వచ్చిన తోటి ప్రయాణికులు అతన్ని బస్సులో నుంచి కిందికు దింపారు. అనంతరం అధికారులకు సమచారం అందజేశారు.