హామిల్టన్: న్యూజిలాండ్‌తో బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంతో మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. హైటెన్షన్ మ్యాచ్‌లో భారత జట్టు విజయాన్ని అందుకుని సిరీస్ సొంతం చేసుకోవడం పట్ల హర్షాన్ని వెలిబుచ్చారు. చివరి నిమిషంలో మ్యాచ్‌ను మలుపు తిప్పిన మహ్మద్ షమీ, సూపర్ సిక్సర్లతో విన్నింగ్ షాట్లు కొట్టిన రోహిత్ శర్మను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం రోహిత్ శర్మకే సాధ్యమని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. చివరి ఓవర్‌లో 4 బంతులకు 2 పరుగులు మాత్రమే ఇచ్చి షమీ ఊహించని ప్రదర్శన చేశాడని ప్రశంసించాడు.
న్యూజిలాండ్ గడ్డపై టి20 సిరీస్ గెలిచి టీమిండియా చరిత్ర సృష్టించిందని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. ప్రపంచంలోనే తానెందుకు ప్రమాదర బ్యాట్స్‌మనో రోహిత్ శర్మ మరోసారి తన ఆటతో చూపించాడని వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ చాలా కాలం గుర్తుండిపోతుందన్నాడు. హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ కూడా రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించారు. క్రికెట్‌లో ఉన్నత నాణ్యమైన ఆటకు ఈ మ్యాచ్ ఉదహరణగా నిలుస్తుందని బ్రదీనాథ్ ట్వీట్ చేశాడు. న్యూజిలాండ్ ఓడినప్పటికీ ఆకట్టుకుందని, విలియమ్సన్ బాగా పోరాడాడని పేర్కొన్నాడు. (చదవండి: టీమిండియా ‘సూపర్’ విజయం)